Thursday, April 6, 2023

Amma, Look at Me

 

_*ఇది చదవండి! తేనెలూరు తెనుగు పదాల ఊట మనసును నింపుతుంది.*_

(మరొక సమూహం నుండి సేకరణ)

_*అమ్మవారికి అచ్చ తెనుగు మాటల ఆత్మ నివేదన*_






    ఏంటమ్మా ఇది.. 

    ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

    కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

   “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

    చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

    పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. 

    అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 

     ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

     అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

    పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

    అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

   “పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. 

    మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 

    పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివపతివ్రతవు*. 

    *కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 

     మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

    మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

   మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 

    నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది. 

    మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

    సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 

    ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

*“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

    ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 

    నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

    నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

    అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

  అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

    సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా* 

*ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


    ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

    ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

   *“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

    మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

    మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

    కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


    అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

   *“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది.


ఇక్కడే ఇంకొక్క


విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! 

   *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

     సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 

     ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు 

   *“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

  *“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

    అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 

    ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

    ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

    మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

    సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో, 

     శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, 

     లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల. 

     ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

    ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

   *“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

   *“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

    *మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.

    ఇక సముద్రాలగారి *“జననీ శివకామినీ..”*, పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.

    మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

*పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

*అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

*సర్వార్థ సంధాత్రి* 

*జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

    మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే! 

    అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. 

    ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను. 

    అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, 

    శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

    వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

    ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, 

    మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

    మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 

    కానీ నీ సంగతి అలా కాదు కదా! 

    అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

    లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదాశివకుటుంబిని”వి.* 

    అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను. 

    *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*

No comments:

Post a Comment