Tuesday, April 11, 2023

 *ఆశుతోషుని అనుగ్రహం - శివరహాస్యం నుంచి...!!*


 *ఆశుతోషుని అనుగ్రహం - శివరహాస్యం నుంచి...!!*

ఇళ్ళలో పూజించే లింగం పిడికిలిలో ఇమిడేలా (అంగుష్ఠ ప్రమాణం) ఉండాలి...

పార్థివలింగం అయితే తెరచిన పిడికిలి పరిమాణంలో ఉండవచ్చు (ఆరు అంగుళాలకి తక్కువ ఉండరాదు). 

ఆరు అంగుళాలకి తక్కువ ఉంటే ఆయుఃక్షీణం అవుతుంది.

అయితే అధిక సంఖ్యలో - (సహస్ర)లింగాలు చేసేటప్పుడు అనేక లింగాలు పెడతాం గనుక అవి చిన్నవే ఉంటాయి. 

వాటికి లెక్క లేదు, ఆలయాలలో పూజించే లింగములు ఇంతకంటే పెద్దవి ఉండవచ్చు.

శివపూజను చేసే చేతులు, శివాలయానికి వెళ్ళే కాళ్ళు, శివాలయంలో ప్రదక్షిణ చేసే పాదములు, శివునికి అర్పించిన మారేడుదళాదుల వాసనను ఆఘ్రాణించడం ,


శివనైవేద్యాలను భుజించడం, హృదయంలో శివుని ధ్యానించడం - ఈ అయిదు క్రియలు ఎవరికైతే ఉంటాయో వారికి దుఃఖాలు ఉండవు.

వాళ్ళు జన్మను సార్థక పరచుకున్నవారు, శివభక్తులలో గొప్పవారు అని చెప్పబడతారు, జీవికగా అయినా సరే ఆలయాలు శుభ్రం చేస్తే పదివేల చాంద్రాయణ వ్రతములు చేసిన ఫలితం పొందుతాడు.

తడిగా ఉన్న వస్త్రంతో తుడిస్తే అతిరాత్రమనే వైదిక యజ్ఞం చేసిన ఫలం కలుగుతుంది, శివాలయంలో బియ్యపు పిండితో రంగవల్లులు దిద్దినా, రకరకాల వన్నెలతో పద్మము, శంఖము మొదలైన ఆకృతులతో ముగ్గులు వేసినా అగ్నిష్టోమము అని చెప్పబడుతున్న వేదక్రతువు చేసిన ఫలం కలుగుతుంది.


కపిలగోవు కానీ మరి ఏ ఇతర (దేశీయ) గోవు క్షీరంతో అయినా శివునకు అభిషేకం చేస్తే వాని యొక్క వందలకొలది అపరాధాలైనా సరే ఆశుతోషుడు క్షమించి అనుగ్రహిస్తాడు.

కృష్ణాష్టమినాడు, సోమవారంనాడు ప్రదోషకాలంలో శివునికి నేతితో అభిషేకిస్తే దాని ఫలితం అమోఘమైనది, అనంతమైనది.


చెరకురసంతో పరమేశ్వరునికి అభిషేకం చేసినవారు వారి వంశంలోని అనేక తరాలతో సహా కైలాసాన్ని చేరతారు.


ప్రాతఃకాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, ప్రదోష కాలాలలో శివలింగాన్ని చూసినా, అర్చించినా వారు శివగణములలో ముఖ్యమైన వారు అవుతారు.


కుశ (దర్భల) జలములతో అభిషేకం భక్తితో చేసినవారు బంగారు విమానంలో బ్రహ్మలోకానికి చేరుకుంటారు...

దీనికి కొనలతో ఉన్న దర్భలు ఉపయోగించాలి, దర్భకు చివరిభాగాన్ని లవం అంటారు.


పచ్చకర్పూరము, అగరు మొదలైన వాటితో కూడిన జలముతో శివుని అభిషేకం చేస్తే సర్వపాపములూ తొలగి శివమందిరాన్ని చేరుకుంటారు.


పితృదేవతలు సద్గతిని పొందాలి అని సంకల్పించుకుని శివలింగానికి చల్లని నీటితో అభిషేకం చేస్తే, ఒకవేళ పితరులు నరకంలో ఉంటే ఉద్ధరింపబడి ఉత్తమలోకాలకు చేరతారు.


నెయ్యితో అభిషేకం చేశాక బియ్యపుపిండి కానీ, గోధుమపిండి కానీ తీసుకుని ఆ పిండిలో సుగంధములు కలిపి గోరువెచ్చని నీరు పోస్తూ శివలింగాన్ని శుభ్రం చేయాలి.


లింగ పీఠాన్ని, అంతటినీ బిల్వపత్రములతో శుద్ధి చేయాలి. ఇలా శుభ్రం చేసిన వారికి పదివేల ధేనువులు దానం చేసిన ఫలం లభిస్తుంది.


పుష్పమాలలు సమర్పించడం, పుష్పమండపం తయారుచేయడం, క్రిందివరకూ పూల మాలలు వ్రేలాడుతూ ఉండేలా చేస్తే ఆశ్చర్యకరంగా దేవతలు దగ్గరుండి దివ్యవిమానముల మీద శివపురమునకు తీసుకువెళ్తారు.


లింగమును, లింగపీఠాన్ని పూజించడం వల్ల దేవీ దేవతలను ఇద్దరినీ పూజించినట్లు అవుతుంది.


స్వామికి చేసే నివేదనలలో గోధుమలతో శర్కర (పటికబెల్లం/ బెల్లం) కలిపి అపూపములు (అప్పాలు) ఆవునేతితో వేయించి చేస్తే అది ఉత్కృష్టమైన భక్ష్యమై తరింపజేస్తుంది.


శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే ఒకొక్క అడుగుకి వెయ్యి అశ్వమేధాలు చేసిన ఫలం లభిస్తుంది.


ఆవుపాలు, నెయ్యి, పెరుగులతో కలిపిన అన్నములు, అనేక రకములైన కూరలు కలిపిన అన్నం, పూరీలు, అప్పాలు, మొదలైనవి విశేషంగా శివునకు నివేదన చేస్తే వారు నరకాలు చూడరు, వారికి పాపఫలాలు ఉండవు సరికదా ... దివ్యమైన భోగములు అనుభవిస్తారు.


శివునకు నివేదన చేసినప్పుడు ఎన్ని బియ్యపు గింజలు అందులో ఉన్నాయో ఒకొక్క మెతుకుకీ వెయ్యి సంవత్సరాల చొప్పున యుగ సహస్రాలు దివ్యలోకాలలో ఉంటారు. 

నిష్కామంగా చేసిన వారు రుద్రలోకానికే చేరుతారు.


గంధ జలములతో శివలింగాన్ని అభిషేకించినవారు గంధర్వాది లోకాలకు చేరుతారు.


లవంగము, కర్పూరము, మాదీఫలం, కొబ్బరి పలుకులు, జాతీపత్రం అనబడే పంచ సౌగంధికములతో తాంబూలం సకామంగా సమర్పిస్తే అనంతకాలం స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు.


నిష్కామంగా చేసినవారికి ఇహంలోనే జ్ఞానం, కైవల్యం క్రమంగా సిద్ధిస్తుంది...


స్వస్తి..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments:

Post a Comment