Monday, January 16, 2017

పదవ తరగతి ( 10 class ) త‌ర్వాత ప‌య‌న‌మెటు….
ప్రతి విద్యార్ధి కి చాలా ఉపయోగ పడే సమాచారం ...

విద్యార్థుల జీవితాల్లో కీల‌క ఘ‌ట్టాల్లో మెద‌టిది, ముఖ్యమైన‌ది ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ఎంచుకునే మార్గమే. ఎందుకంటే అప్పటి వ‌ర‌కు విద్యార్థులంతా ఉమ్మడిగానే స‌బ్జెక్టుల‌న్నీ చ‌దువుకుంటారు కాబ‌ట్టి ఈ కోర్సుల గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ ప‌ది పూర్తయిందంటే చాలు అందుబాటులో ఎన్నో కోర్సులు ఉంటాయి. అయితే వాటిలో ఒక్కటి మాత్రమే ఎంచుకునే వీలుంటుంది. అందువ‌ల్ల కెరీర్ ఎంపిక‌లో ఆచితూచి అడుగులేయ‌డం ముఖ్యం. సంప్రదాయానికి ఓటేయాలా? పెద్దల మాట‌ల‌ను గౌర‌వించాలా? అమ్మానాన్నలు చెప్పిన కోర్సులే చ‌ద‌వాలా? వీట‌న్నింటినీ ప‌క్కన‌పెట్టి అభిరుచి దిశ‌గా అడుగులేయాలా? ఇలా ప‌లు ర‌కాల ప్రశ్నలు విద్యార్థుల మెద‌డులో ఉత్పన్నమ‌వుతాయి. అందుకే అన్ని కోణాల్లోనూ ఆలోచించిన త‌ర్వాతే ఏ కోర్సులో చేరాలో నిర్ణయం తీసుకోవాలి.


టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ గ్రూపులు

ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా, ఇంటర్మీడియట్‌తోనే ఆరంగేట్రం చేయాలి. అయితే ఇంటర్లో ఏయే గ్రూపులు ఉంటాయి? ఏ గ్రూపు చదివితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? అసలు గ్రూపులను ఎలా ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత ఏం చేయాలి?”… పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మనసులో మెదిలే ప్రశ్నలివి. ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు, గ్రూపు ఎంపికలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేందుకు అందిస్తున్న సమాచారమిది.

టెన్త్ తర్వాత వృత్తివిద్య

ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీడియట్ వారధిలాంటిదైతే, ఉపాధికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు నిచ్చెనల్లాంటివి. పదోతరగతి తర్వాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలను, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునే వారు సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపుల్లో చేరతారు.
రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులకు మరింత ప్రయోజనాన్ని కల్పించే దిశగా అధికారులు కొత్త రూపునిచ్చారు.ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటివరకూ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలే లేని ఈ కోర్సులకు తొలిసారిగా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు.

టెన్త్ తర్వాత పాలిటెక్నిక్

పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయి? తదితర అంశాల గురించి తెలుసుకుందాం.


టెన్త్ తర్వాత ఐటీఐ

ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థి పదోతరగతి తర్వాత ఒకటి, రెండేళ్ల కాలవ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ అతి తక్కువ వ్యయంతోనే. దీనివల్ల చిన్న వయసులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలోనే ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. టెన్త్ తర్వాత ఒకటి రెండేళ్ల పాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే, మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే విద్యార్థుల వంతు.

టెన్త్ తర్వాత ఆర్‌జేసీ

విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అత్యంత ప్రశాంత వాతావరణంలో అందించాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు 1972లో ఏర్పాటయ్యాయి. పట్టణాలు, నగరాలకు దూరంగా, విద్యకు ఎటువంటి ప్రతిబంధకాలూ లేని ప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించి, విద్యార్థుల ఏకాగ్రతను పెంచే దిశగా ఇవి పనిచేస్తున్నాయి. సత్ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో గురుకుల విద్యాలయాల పట్ల ఆదరణ పెరిగింది.


టెన్త్ తర్వాత ఉద్యోగాలు

పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.
ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.

సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్


కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ సీపీవో (భద్రతా విభాగాలు)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.
సీపీవో పరిధిలోని ప్రధాన విభాగాలు:
1) బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
2) సీఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్‌సెక్యూరిటీ ఫోర్స్
3) సీఆర్‌పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
4) ఎస్ఎస్‌బీ సశస్త్ర సీమబల్
5) ఐటీబీపీఎఫ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మూడు దశలుగా జరుగుతుంది.
మొదటి దశ: శారీరక సామర్థ్య పరీక్ష. దీన్లో పరుగు పందెం నిర్వహిస్తారు. తర్వాత లాంగ్‌జంప్, హైజంప్ ఉంటాయి.
రెండో దశ: ఇది రాత పరీక్షకు సంబంధించింది. మొదటి దశ పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు.
మూడో దశ: మొదటి రెండు దశల్లో జరిగిన పరీక్షల్లో విజయం సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు..
వెబ్‌సైట్: ssc.nic.in

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుళ్లు

రైల్వేలో రక్షణ విభాగానికి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ. పురుషులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది. దీన్లో అర్హత సాధించిన వారికి తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌లు: www.indianrailways.gov.in&www.scrailway.gov.in

గ్రూప్ – IV
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతుంది. గ్రూప్ – IV స్థాయి ఉద్యోగాల నుంచి గ్రూప్ – I కేడర్ వరకూ నియామక ప్రక్రియను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. వీటిలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశమున్న ఉద్యోగాల గురించి తెలుసుకుందాం
గ్రూప్- IV స్థాయిలో ఏపీ జువైనెల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సబ్ సర్వీసెస్‌లో సూపర్‌వైజర్లు, మ్యాట్రన్ పోస్టులు.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు.
వెబ్‌సైట్‌లు: www.apspsc.gov.in, www.tspsc.gov.in

ప్రభుత్వ అటవీ శాఖ జిల్లాల వారీగా కింది ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
1) అసిస్టెంట్ బీట్ అధికారులు
2) బంగ్లా వాచర్
3) ఠాగేదారు
ఈ మూడింటికి కనీస అర్హత పదో తరగతి.
వయసు: ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎత్తు: పురుషులు 163 సెం.మీ., స్త్రీలు 150 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: అర్హులైన వారికి మొదట శారీరక కొలతల పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధిస్తే రాత పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష విధానం:
1) వ్యాస రచన (జనరల్ ఎస్సే 20 మార్కులకు. సమయం: గంట)
2) జనరల్ నాలెడ్జ్ (100 మార్కులకు సమయం: గంటన్నర)
3) మ్యాథమేటిక్స్ (100 మార్కులకు సమయం: గంటన్నర) సబ్జెక్టులపై పరీక్ష.

రాత పరీక్షలో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపల పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయాలి. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా ప్రకటనలు వస్తుంటాయి.

No comments:

Post a Comment