Tuesday, January 10, 2017

ఒక పాతపెన్సిల్ ముక్క.!
                   నాకు పదేళ్ళప్పుడు ఓరోజు స్కూలు నుంచి నడుచుకుంటూ తిరిగొస్తుంటే , దారిలో చిన్న పెన్సిల్ ముక్క దొరికింది . దాన్ని తీసి చూస్తే బాగా చిన్నగాను,దాన్నిండా సొట్టలు పడి దీనంగా చూస్తోంది నావైపు. దాన్ని చూసుకుంటా ఇంటివైపు నడిస్తుంటే క్రమంగా నా మనస్సులో అది పోగొట్టుకున్న వాడెవడు అనే ఆలోచన వచ్చింది. ఆ పెన్సిల్ వాటం చూస్తుంటే అది బాగా పేదవాడిదేననిపించింది. వాడిప్పుడు దీనికోసం ఎంత భాద పడుతున్నాడో అనిపించింది . క్రమేపీ నాలో భాద పెరిగి పెరిగి ఇంటికొచ్చేసరికి బెంగగా మారిపోయింది . అదే ఆలోచనతో  పోగొట్టుకొన్నోడి భాద నాదిగా మారిపోయింది. ఆ పెన్సిల్ తోనే మా యింటిగోడపై ఇలా రాసుకున్నాను." ఈ పెన్సిల్ ఎవరో ఒక పేద అబ్బాయిది .పాపం పోయింది .ఎంతభాదపడుతున్నాడో" . ఇలా రాసిన మరుక్షణం నా కళ్ళలో నీరు . ఆ రాసిన అక్షరాల్ని రోజూ చూసుకునే వాణ్ణి . ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటికి పెయింటింగ్ అవుతుంది. గబాగబా నా పెన్సిల్ కద రాసిన చోటుకెళ్ళి చూసాను . అప్పటికే అది కప్పబడిపోయింది.
      కానీ యిప్పటికీ ఆ అనుభవం నాలో సజీవంగానే ఉంది.  ఓ పదేళ్ళ వయసుకి సహజంగా ఉండే ప్రేమ దయ కరుణ తప్ప మరేం కాదని నాకూ తెలుసు . ఇదిచిన్నపిల్లల కదలా ఉండొచ్చు, కానీ మనకర్దం కాని సాద్యంకాని ఓవిలువైనస్దితిని దాటొచ్చేసామని తప్పకండాతెలుసుకోవాలి.
            అయితే నాకు తెలీందల్లా ......,
  రోడ్డు పక్కన ప్రమాదంలో రక్తమోడుతూ ఒక  కుటుంబం గిలగిల్లాడుతుంటే బస్ ఆపి దిగిపోకండా కిటికీలోంచే అయ్యయ్యో ఘోరమండీ , అని సరిపెట్టేసుకునే కరుకుదనం ఎప్పుడు వచ్చిందా అని..!
      నా మిత్రుడి అనారోగ్యం వాడి ప్రాణాల్ని తినేస్తున్నా నా విలాసాల్ని కరిగించి ఆడి ప్రాణాలు నిలబెట్టొచ్చన్న మనిషి తనం మర్చిపోయి మనమేం చెయ్యగలం ,అనే కుంటిసాకుల వెనక దాక్కోడం ఎప్పుడు తెలుసుకున్నానా  అని..!
      నా చుట్టూ జీవన్మరణంతో పిడచకట్టుకుపోతున్న  జీవితాల్ని , నరకంలో నలిగిపోతున్న బతుకుల్ని చూస్తూ ఆళ్ళ ఖర్మ అనే పేరుతో ఒక్క పెద్ద గెంతు ఎప్పుడు నేర్చుకున్నానా అని..!
        సమాజం నాకు  యిస్తున్న ఈ నా జీతం, నా జీవితం పూర్తిగా నా విద్వత్తు , శ్రమ మాత్రమే కాదని , దాని వెనక సాద్యాసాద్యాల చిక్కుముడుల సమాహారాలున్నాయని తెలిసికూడా ఈ నాసౌఖ్యంలోంచి  ఓ పదో వంతు ని కూడా సమాజానికి విదల్చని నా యినప్పెట్టె మనసుని ఎక్కడ నుంచి ఎరువు తెచ్చుకున్నానా అని..!

     పెద్దయ్యాక సంగీత స్వరసాదనలో ఆరోహణలకే , అంత సాదనలోనూ, భోరున ఏడ్చేసే పసితనపు సహజత్వం నాకేదో చెప్తోంది ..; గొంతుకడ్డం పడ్డ ఆ మానవత్వం నన్నెక్కడికో మేల్కొలుపుతుంది ...!

Received in Whatsup..

No comments:

Post a Comment