ఆరింటికి “ఆకాశవాణి
విశాఖపట్నం కేంద్రం.." అనగానే లేచి కూచునేవాళ్ళం. గబగబా దంతధావనం కానిచ్చేసి
కాసిన్ని పాలు తాగేసి హోమ్ వర్కేఁవైనా వుంటే కానిచ్చేసి కాలకృత్యాలు
తీర్చుకునేటప్పటికి పుష్పాంజలి మొదలయ్యేది.
సోమవారంనాడు భూకైలాస్, భక్త కన్నప్ప
పాటలు, మంగళవారం సూపర్‌మేన్ లో “శ్రీ ఆంజనేయా
ప్రసన్నాంజనేయా" అన్నపాటో, కలియుగ
రావణాసురుడు సినిమాలో “నమో నమో
హనుమంతా" అన్నపాటో...ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!
స్కూలునించి మధ్యాహ్నం భోజనానికి వస్తే “ఆకాశవాణి! ఈవార్తలు ఇంతటితో సమాప్తం!" అంటూ కందుకూరి
సూర్యనారాయణో, అద్దంకి మన్నారో,
పార్వతీ ప్రసాదో..ఎవరో ఒకరు పలకరించేవారు. “అన్నాలకి లేవండి!
మళ్ళా ఆలస్యఁవైందంటారు!" అని అమ్మ తరుముతోంటే గబగబా తింటూ కార్మికుల
కార్యక్రమం వినేవాళ్ళం.
చిన్నక్క, ఏకాంబరం కలిసి
కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు
ప్రసారం చేసేవారు. సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది.
అంతే! పరుగోపరుగు. నడిచి స్కూలుకెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టేది.
ఎప్పుడైనా సెలవురోజు ఇంట్లోవుంటే పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ
వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి
శ్రీరాములు....వీళ్ళంతా! అవవ్వగానే “మనోరంజని! మీరు
కోరిన మధురగీతాలు వింటారు!" అని మీనాక్షో, ఏవియస్ రామారావో
అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం. ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా
మంచిమంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించిమరీ వినేవాళ్ళం.
రెండవ్వగానే ఇంగ్లీషులో వార్తలు..ఢిల్లీనించి
ప్రసారమయ్యేవి. ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన
ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.
ఇప్పుడు వాట్సప్పుల్లోను, ఫేస్ బుక్కుల్లోను
కనబడే ‘ హ్మ్......., లోల్....., ఆర్వోఎఫ్ఫెల్....., కె..కె...(ఓకే ఓకే
కొచ్చిన తిప్పలు)..ఇవన్నీ చదువుతోంటే నవ్వు, అసహ్యం, భయం....ఈమూడురకాల భావాలు ఒకేసారి కలుగుతున్నాయి.
నిన్నొకటి చూసాను. ‘డబ్ల్యూ సి' అని రాస్తున్నారు. చాలాచోట్ల చూసాక అడిగితే అది ‘వెల్ కమ్' అని చెప్పారు మా
వంశోద్ధారకులు. నా సందేహమేంటంటే వీళ్ళు కొన్నాళ్ళకి వెల్ కమ్ స్పెల్లింగు
మర్చిపోతారేమోనని!
సర్సరే! రేడియోలో వున్నాంకదా! ఇక ఆదివారాలు సాయంత్రం
నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు. వి.వి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ
గొంతు వింటోంటే మంత్రముగ్ధులమైపోయేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు మనకి ఎంత
ప్రయత్నించినా వక్రభాష రాదు.
ఇప్పుడు మన యాంకర్లు, టీవీ డబ్బింగ్
ఆర్టిస్టులు, దుష్టచతుష్టయపు హీరోలు...వీరందరూ
మాట్లాడుతున్న భాష వినికూడా మనం బ్రతికున్నామంటే ఏదో బలమైన కారణం, మనవల్ల ఈ సమాజానికి జరగాల్సిన మంచి వుండివుంటాయి 😜
ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ
పాటలవీ వేస్తుండేవారు. అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత
కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని
ఆలకించిన మాజన్మలు ధన్యం.
రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో
కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ
గుర్తుంచుకుంటాం.
ఉండడానికి వేలాది ఛానల్స్ వున్నాయిప్పుడు. పార్టీ ప్రచారాలు, డప్పులు, ర్యాంకుల
రాద్ధాంతాలతో కొందరు, ‘జంక్షన్లో నా
ఫంక్షన్ పెడితే పిల్లో బోర్ల పడతవె పిల్లో' అన్నపాటకి
అత్తాకోడళ్ళు ఇద్దరిచేతా సిగ్గులేని డ్యాన్సులు చేయించే వెధవాయిలు కొందరు...! ఇక
సినిమాలైతే ఐనాక్సువాడు పద్దెనిమిదేళ్ళు నిండనివాళ్ళకి చూపించని సినిమాలన్నీ
టీవీలో యధేచ్ఛగా చూసెయ్యచ్చు.
గొంగట్లో తింటూ వెంట్రుకలేరుకోడమంటే ఇదేనేమో?!
No comments:
Post a Comment