కిడ్నీలో రాళ్లా?
కిడ్నీల్లో రాళ్ల బాధ అంతాఇంతా కాదు. మూత్రం పోసిన
ప్రతిసారీ నొప్పి, మంట తీవ్రంగా
వేధిస్తాయి. అందుకే ఒకసారి ఈ బాధలను అనుభవించినవారు మళ్లీ వాటి బారినపడకూడదనే
కోరుకుంటారు. మంచి విషయం ఏంటంటే.. కిడ్నీలో రాళ్లను నివారించుకునే మార్గం మన
చేతుల్లోనే ఉంది.
నీరు బాగా తాగాలి: కిడ్నీలో రాళ్లు
ఏర్పడటానికి ఒంట్లో నీటి శాతం తగ్గటం ప్రధాన కారణం. కాబట్టి బాగా నీళ్లు తాగితే
రాళ్లు ఏర్పడటాన్నీ నివారించుకోవచ్చు. దాహం వేసేంతవరకు ఆగకుండా రోజంతా తరచుగా
నీళ్లు తాగుతుండాలి. ముఖ్యంగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఒంట్లో నీటి
శాతం తగ్గే అవకాశం ఎక్కువ. అందువల్ల ఎండకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
నిస్సత్తువ, ఆకలి తగ్గటం, తల తేలిపోవటం, మూత్రం పసుపురంగులో రావటం, పొడిదగ్గు..
ఇవన్నీ ఒంట్లో నీరు తగ్గిందనటానికి సంకేతాలే.
ఉప్పు తగ్గించాలి: ఉప్పులో సోడియం
ఉంటుంది. దీన్ని తగ్గించుకుంటే మూత్రంలో క్యాల్షియం స్థాయులూ తగ్గుతాయి. ఫలితంగా
క్యాల్షియం రకం రాళ్లు ఏర్పడటమూ తగ్గుతుంది. భోజనం చేస్తున్నప్పుడు అదనంగా ఉప్పు
వాడకపోవటం, మిక్చర్ వంటి ఉప్పు ఎక్కువగా ఉండే
చిరుతిళ్లు తగ్గించటం మేలు చేస్తాయి. మాంసం, గుడ్లు, చేపలతో పాటు ఉప్పు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ను కూడా
పరిమితం చేసుకోవాలి.
పుల్లటి పండ్లు తినాలి: నారింజ, బత్తాయి, నిమ్మ వంటి
పుల్లటి పండ్లలో సిట్రిక్ ఆమ్లం దండిగా ఉంటుంది. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని
నివారిస్తాయి. రోజుకు 120 మిల్లీలీటర్ల
నిమ్మరసాన్ని రెండు లీటర్ల నీటిలో కలిపి తరచుగా తాగుతుంటే కిడ్నీ రాళ్లు ఏర్పడే
అవకాశం గణనీయంగా తగ్గుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చిన్నరాళ్లు
సమస్యాత్మకంగా మారకుండానూ చూసుకోవచ్చు.
No comments:
Post a Comment