Saturday, March 4, 2023

అహల్యా గౌతముల వృత్తాంతం అంతరార్థం

 అహల్యా గౌతముల వృత్తాంతం అంతరార్థం


దేహధారియైన జీవుడే గౌతముడు. జీవుని మనస్సే అహల్య, మలినాంతఃకరణమే ఇంద్రుడు. ధ్యానమందున్న శుద్ధజీవుడు మలినాంతః కరణముగా మారుటయే ఇంద్రుడు గౌతమ రూపధారియగుట. మలినాంతఃకరణ ప్రేరణచే మనస్సు ఇంద్రియ విషయ సుఖమనుభవించుటే అహల్యా జారత్వము. ఇంద్రియప్రేరణకు మూలమైన కామబీజములను (విషయవాసనలను) తెంచుటే అంతఃకరణ మనెడు ఇంద్రునకు గల్గిన (ముష్క ఖండన) బీజఖండన శాపము. (వాసన క్షయము) ఇంద్రియ సుఖానుభవముచే దోషియైన (పాపియైన) మనస్సును అదృశ్యమగునట్లు శిక్షించి, జీవుడమనస్కుడగుటయే అహల్యా శాపము (మనోనాశము) కామ వాసనక్షయమైన అంతఃకరణమందు మోక్షపర్యంతము వఱకు నిష్కామముతో గూడిన శుభవాసనలంటియుండుటే ఇంద్రునకు మేషబీజములు అతికింపబడి యథారీతిగా నుండుట.అనగా జీవుడు శుద్ధాంతఃకరణముతో నిస్పృహ గలిగియుండుట యని భావము.


జీవుడు యోగసాధన చేయుచుండగా, లయించియుండిన మనస్సునకు ఆత్మదర్శనము కాగా, వాసనాక్షయమైన మనస్సును తిరిగి పరిగ్రహించుటయే గౌతముడు తిరిగి అహల్యను పరిగ్రహించుట. నిర్వాసనతో గూడిన మనస్సుతో జీవుడు ధ్యానము (యోగము) చేసికొనుచుండుటే గౌతముడు అహల్యతో సంసారము చేయుచు, తపమాచరించు కొనుచుండుట. ఇట్లు నిరంతర యోగసాధనచే జీవుడు తుదకు మోక్షమొందుటే గౌతముడు బ్రహ్మైక్యము నొందుట.ఈ అహల్యా గౌతమ చరిత్ర ద్వారా తెలియదగినదే యోగసాధనము చేయుచున్న స్త్రీ పురుషులెల్లరు ఆత్మదర్శనమునకు ప్రతిబంధకములైన ఇంద్రియములను మొదట నిగ్రహించవలెననియు పిమ్మట మనస్సును సంస్కరించుకొనవలయుననియు, నిష్కామముతో గూడిన శుద్ధబుద్ధి (శుద్ధసాత్వికవృత్తితో) యోగసాధన (బ్రహ్మనిష్ఠ) చేసికొనుచున్నచో పునర్జన్మమోక్షము సిద్ధించునని యెఱుంగ వలయును. యోగసాధకుల చరిత్రయే అహల్య గౌతముల చరిత్రయని పాఠకులు గ్రహింతురుగాక. న+హల్య=అహల్య, హలము=నాగలి, హల్య=నాగలిచే దున్ని సంస్కరింపబడిన భూమి మొదలగునవి. అహల్య ఏ సాధనము చేతను సంస్కరింపబడనిది. అహల్యయనగా సంస్కార రహితమైన మనస్సని గ్రహింపవలెను...

.


భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది.


బియ్యపుగింజకూ, వరిగింజకూ మధ్య ఉన్న సంబంధంలో  ఎంతో గొప్పఆధ్యాత్మిక విజ్ఞానమున్నది.


పొట్టు ఉంటే వరిగింజ. పొట్టును తొలగిస్తే బియ్యపుగింజ. పొట్టు ఉంటేనే గింజ తిరిగి మొలకెత్తుతుంది. పొట్టును తొలగించినట్లయితే గింజ తిరిగి మొలకెత్తదు. పొట్టు అనేది  అజ్ఞానం లాంటిది.


అజ్ఞానం ఉంటే జీవుడు. అజ్ఞానం తొలిగిపోతే దేవుడు. అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది. అజ్ఞానం తొలగినవాడికి పునర్జన్మ  లేదు.


 *కనుక మనమందరమూ సద్గ్రంథ పఠనం చేసి, సజ్జన సహవాసం చేసి, సద్ సేవ చేసి, ఇలాంటి సత్సంగంలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకొనే ప్రయత్నంచేయాలి*


సాంగత్యం ఎలా ఉండాలి? కధ


ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు, ఏమి దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడకు వచ్చింది, ఎవరో పడుకున్నాడు, అతనిపై నీడ రావడం లేదు, కలత చెందుతున్నాడని, అతనిపై ఎండవస్తోంది అని గమనించి, ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది. వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది.


కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు, ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, హంసతో మాటలు కలిపింది. ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు. హంస కింద పడి చనిపోతూ, నేను నీకు నీడ ఇచ్చి సేవ చేసాను. నీవు నన్ను చంపావు. ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది.


అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు. నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు. నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి.

నీ ఆచారాలు స్వచ్ఛమైనవి. నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు, 

కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణ కాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది.


*అందుకే మన పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సాంగత్యం లోనే వుండమని.*


సత్సంగత్వే - నిస్సంగత్వం

నిస్సంగత్వే- నిర్మోహత్వం,

నిర్మొహత్వే - నిశ్చల తత్త్వం,

నిశ్చల తత్వే - జీవన్ముక్తి:....  ****శివార్పణం****

No comments:

Post a Comment