Sunday, March 19, 2023

Eswra -- Trayambaka


 *త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి......?*

*శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి...?*


_మహా మృత్యుంజయ మంత్రం_


ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |

ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

అంటే...

అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. 

దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!


'మహా మృత్యుంజయ మంత్రం పై కొన్ని సందేహాలుంటాయి...

ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని!!...


మరి అలాంటప్పుడు ఈ _మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు?_


అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? 

అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియదు!!! అర్థం కాదు!!... 


మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు... 

పునర్జన్మ లేకపోవడం, అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. 

అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. 

ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. 

ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి.

ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. 


*అది ఎలాగంటారా?*

ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి, సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. 

ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది.


జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. 

అంటే మాయనుండి విడివడతాడు. 

పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను..


దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. 

(జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు.


ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు...

పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కద...


ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. 


_ఆ ఆరాధన ఎలాగుండాలంటే - జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం._


మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. 

ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. 

అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి, శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

*పంచభూతాత్మకుడు :-*

శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.


*త్రయంబకుడు :-* 

శివుని మూడుకన్నులు కాలాలను (భూత, భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. 

ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. 

ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. 

దీనినే త్రివేణి సంగమం అని అంటారు.


*నామము :-* 

శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. 

అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.


*విభూతిదారుడు :-* 

సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. 

అంటే భస్మంగాక తప్పదు, నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.


*త్రిశూలం :-* 

సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.


*నాగాభరణుడు :-* 

సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం.


అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు.


అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.


 సేకరణ ....

స్వస్తి🙏🌿☘️

No comments:

Post a Comment