Wednesday, March 15, 2023

Chathur Peethalu


 *భారతదేశంలో చతురామ్నాయ పీఠాలు, వాటి సాంప్రదాయాలు...*


శ్లోకం


" శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ..నమామి భగవత్పాద శంకరం లోకశంకరం !!


⚜️కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా ఈ పుణ్యభూమిలో కేవలం 32 సంవత్సరముల కాలము మాత్రమే నడయాడి, 5వ ఏటనే సన్యాస దీక్ష గ్రహించి వేదవేదాంగాలను అత్యల్ప సమయములోనే అధ్యయనము చేసి అసంఖ్యాకమైన స్త్రోత్ర రచనలెన్నో చేశారు. 

మానవమాత్రులెవ్వరికి సాధ్యం కాని బ్రహ్మ సూత్రాలకు, భగవద్గీతకు, విష్ణు సహస్ర నామములకు భాష్యం చెప్పారు. 

అద్వైత తత్వాన్ని భోధించారు. 

ఆసేతు హిమాచలం మూడు సార్లు కాలినడకన నడయాడి, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన 72 అవైదిక మతాలను, సిద్ధాంతాలను నిర్మూలించి  సనాతన వైదిక ధర్మ ప్రతిష్ఠాపన గావించారు. 


⚜️అటువంటి జగద్గురు శ్రీమత్ శంకరభగవత్పాదాచార్యులవారు దూరదృష్టితో ఆలోచించి సనాతన ధర్మ పరిరక్షణకు, ధర్మ స్థాపనకు భారతదేశం నలుమూలలా నాలుగు పీఠాలను స్థాపించి మహాద్భుతమైన సేవ చేశారు. 

ఎలాగైతే దేశ రక్షణకు సైన్యం అవసరమో అలాగే మన ధర్మ రక్షణకు ఈ నాలుగు పీఠాలు అంతే అవసరమని భావించి ఈ పీఠాలను స్థాపించారు. 


⚜️నేడు మరల మన ప్రారబ్ధవశాన అనేక అవైదిక మతాలు, కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. భారతదేశం మొత్తం అంతటా ఎవరు మఠాలు, ఆశ్రమాలు, ఆఖాడాలు, స్థాపించాలన్నా లేక స్వామీజీలు, మఠాధిపతులు, సన్యాసులు, బాబాలు, ఫకీర్లుగా, దేవుళ్ళుగా శాస్త్ర విహితంగా గుర్తింపు పడాలన్నా ఈ పీఠాధిపతుల ఆమోదము ఆత్యావశ్యకము. కాబట్టి ఈ క్లిష్టమైన సమయములో మనకు శంకరలు స్థాపించిన ఆ నాలుగు పీఠాలను స్మరించుకొని నేటి జగద్గురువుల ఉపదేశాను సారము  నడుచుకొని జన్మను సార్థకము చేసుకొందాము. 


చతురామ్నాయ పీఠాలు :


1. తూర్పున గోవర్ధన మఠం - పూరీ క్షేత్రం, ఆమ్నాయం – పూర్వామ్నాయం, సాంప్రదాయం – భోగవార,     దేవత – జగన్నాథుడు, దేవి – విమల, సన్యాసుల నామధేయాలు - వన, అరణ్య, బ్రహ్మచారుల నామధేయాలు – ప్రకాశ, ఆచార్యులు – పద్మపాదాచార్యులు, తీర్థం – సముద్రం, వేదం – ఋగ్వేదం, మహా వాక్యం - ప్రజ్ఞానం బ్రహ్మ, గోత్రం – కాశ్యప, ఈ మఠాధిపత్య ప్రదేశాలు:- అంగ (అస్సాం), వంగ, కళింగ,   మగధ (దక్షిణ బీహార్), ఉత్కల(ఒరిస్సా). 


2. పడమట శారదా మఠం – ద్వారక, ఆమ్నాయం – పశ్చిమామ్నాయం, సాంప్రదాయం – కీటవార,  సన్యాసుల నామధేయాలు - తీర్థ, ఆశ్రమ. బ్రహ్మచారుల నామధేయాలు – స్వరూప, దేవత – సిద్ధేశ్వరుడు, దేవి – భద్రకాళి, ఆచార్యుడు – హస్తామలకచార్య, తీర్థం – గోమతి, వేదము – సామవేదం, మహావాక్యం- 'తత్వమసి' గోత్రం – అభిగత, ఈ పీఠాధిపత్యంలోని ప్రదేశాలు:- సింధు (పంజాబ్), సౌవీర, సౌరాష్ట్ర (సూరత్), మహరాష్ట్ర.


3. ఉత్తరాన జోతిర్మఠం - బదరి క్షేత్రం, ఆమ్నాయం – ఉత్తర, సాంప్రదాయం – ఆనందవార, సన్యాసుల నామధేయాలు - గిరి, పర్వత, సాగర, బ్రహ్మ చారుల నామధేయాలు – ఆనంద, క్షేత్రం – బదరికాశ్రమం, తీర్థం – అలకనంద, దేవత – నారాయణ, దేవి – పూర్ణగిరి, ఆచార్యులు – తోటకాచార్యులు, వేదం - అధర్వణ వేదం, మహావాక్యం - 'అయం ఆత్మా బ్రహ్మ', గోత్రం – భృగు, ఈ పీఠాధిపత్యంలోని ప్రదేశాలు:- కురు (హర్యానా), కాశ్మీర, కాంభోజ, పాంచాల (హర్యానా, హిమాచల్ ప్రదేశ్).


4. దక్షిణాన శృంగేరి పీఠము:- ఆమ్నాయము- దక్షిణామ్నాయం, సాంప్రదాయం-భూరివార, సన్యాసుల నామధేయాలు: సరస్వతి, భారతీ, పూరి, బ్రహ్మచారుల నామధేయాలు – చైతన్య, దేవత - ఆది వరాహ,  దేవి – కామాక్షి, ఆచార్యులు – సురేశ్వరాచార్య, క్షేత్రం – రామేశ్వరం, తీర్థం - తుంగభద్ర నది, వేదం – యజుర్వేదం, మహావాక్యం - అహం బ్రహ్మాస్మి, ఈ పీఠాధిపత్యంలోని ప్రదేశాలు :-  ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాటక.


  శ్లోకం


శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం! 

సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః!!

No comments:

Post a Comment