Thursday, February 23, 2023

World's Highest Eswara Temples


 *ప్రపంచంలోనే ఎత్తయిన పరమశివుడి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?*

             



ఆద్యంత రహితుడు పరమేశ్వరుడు. ఆయనకు ఆది ఉండదు, అంతమూ ఉండదు. సర్వాంతర్యామి. చెంబెడు నీళ్లు పోస్తే..మురిసిపోయే భోళా శంకరుడాయన. ఓ మూరెడు మారేడు దళాలతో పూజిస్తే, కోరిన వరాలను ప్రసాదించే భక్త సులభుడు కూడా. అందుకే- ఒక్క మనదేశంలోనే కాకుండా ఆసియాలోని అనేక దేశాల్లో పరమేశ్వరుడిని పూజిస్తారు భక్తులు. మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే భక్తుల సంఖ్య అనంతం. తమ భక్తిని చాటుకోవడానికి ఆయా దేశాల ప్రజలు ఎత్తయిన పరమ శివుడి విగ్రహాలను నెలకొల్పారు. వాటి విశేషాలే ఇవీ..



🌹నేపాల్.. కైలాసనాథ మహదేవ


ప్రపంచంలోనే అతి ఎత్తయిన శివుడి విగ్రహం నేపాల్ లో ఉంది. కైలాసనాథ మహదేవ విగ్రహం అది. ఈ విగ్రహం ఎత్తు 143 అడుగులు. 2011 జూన్ 21వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేపాల్ లోని భక్తాపూర్ జిల్లాలోని సాంగ ప్రదేశంలో దీన్ని నెలకొల్పారు. నిల్చున్న భంగిమలో ఉన్న ఈ శివుడి విగ్రహం తయారీలో 60 శాతం మేర తామ్రాన్ని వినియోగించారు. మిగిలిన 40 శాతం జింక్, సిమెంట్, ఉక్కును వాడారు. నేపాల్ లో 90 శాతం మంది ప్రజలు హిందువులే. పరమశివుణ్ని పూజిస్తారు. పరమేశ్వరుడు నివాస స్థలం కైలాసం తమ హిమాలయాల్లో ఉందని విశ్వసిస్తారు.


🌹భారత్..మురుడేశ్వరుడు.


ప్రపంచంలో రెండో ఎత్తయిన శివుడి విగ్రహం మనదేశంలోనే ఉంది. కర్ణాటక తీర ప్రాంతం మురుడేశ్వర వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తపస్సు చేస్తున్న భంగిమలో ఉన్న ఈ విగ్రహం ఎత్తు 122 అడుగులు. మనదేశంలో అతి ఎత్తయిన విగ్రహం ఇదే. మురుడేశ్వర సమీపంలోని పవిత్ర పుణ్యక్షేత్రం గోకర్ణం ఉంది. అరేబియా సముద్రానికి ఆనుకునే ఉంటుందీ విగ్రహం. అతి ఎత్తయిన గోపురం కూడా ఇక్కడే ఉంది.



🌹కోయంబత్తూరు..ఆదియోగి


మూడో అతి పెద్ద పరమేశ్వరుని విగ్రహం మనదేశంలోనే ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరులో దీన్ని నెలకొల్పారు. ఛాతీ నుంచి తల వరకు మాత్రమే ఉండే విగ్రహం ఇది. దీని ఎత్తు 112 అడుగులు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. 2017 ఫిబ్రవరి 24వ తేదీన మహా శివరాత్రి పండుగ సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.



🌹సిక్కిం..సిద్ధేశ్వర ధామం


నాలుగో అతి పెద్ద విగ్రహం ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఉంది. సిక్కిం నామ్చీ ప్రాంతంలోని సోలోఫోక్ హిల్స్ పై ఈ విగ్రహాన్ని స్థాపించారు. దీని ఎత్తు 108 అడుగులు. ప్రశాంత వదనంతో ధ్యానాన్ని ఆచరిస్తున్న భంగిమలో ఉంటుంది ఇక్కడి విగ్రహం. 2011లో దీన్ని ఆవిష్కరించారు.



🌹మారిషస్..మంగళ్ మహదేవ్


మారిషస్ లో మంగళ్ మహదేవ్ పేరుతో అయిదో అతిపెద్ద విగ్రహాన్ని స్థాపించారు. ఈ విగ్రహం ఎత్తు కూడా 108 అడుగులు. 

మారిషస్ లోని సావన్నె జిల్లా గంగా తలాబ్ ప్రాంతంలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని 2007లో ఆవిష్కరించారు.

No comments:

Post a Comment